: ఇక తీగలు పట్టుకు వేళ్ళాడొచ్చు!
కరెంటు తీగలపై బట్టలు ఆరేసే రోజు, చిన్నపిల్లలు ఆ తీగలతో ఉయ్యాల ఊగే రోజు మరెంతో దూరంలో లేదంటూ ఉభయరాష్ట్రాల్లో ఇప్పుడు సరదాగా వ్యాఖ్యానించుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభం మరికొద్ది రోజుల్లో తీవ్రం కానుందని విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో 7 గంటల కోత అమలులో ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 4 గంటలు కోత విధిస్తున్నారు. హైదరాబాదు, విశాఖ వంటి నగరాల్లోనూ ఇదే పరిస్థితి.
వాతావరణ పరిస్థితులకు తోడు, రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపిణీ సమస్యలు ఈ దుస్థితికి కారణమన్నది నిపుణుల విశ్లేషణ. రెండు రాష్ట్రాలకు కలిపి మొత్తం 13,000 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా, సదరన్ గ్రిడ్ నుంచి 10,090 మెగావాట్ల విద్యుత్ మాత్రమే అందుతోంది. 3000 మెగావాట్ల లోటు కారణంగానే భారీగా కోతలు విధించాల్సి వస్తోందని అధికారులు అంటున్నారు.