: జాబు కావాలంటే బాబు రావాల్సిందే... ఎందుకు ఉడుక్కుంటారు: చంద్రబాబు
గవర్నర్ ప్రసంగంపై సమాధానం చెబుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, జాబు కావాలంటే బాబు రావాల్సిందేనని ప్రజలు నమ్మారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు టీడీపీ కట్టుబడి ఉందని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో టీడీపీ సఫలమవుతుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆసక్తికర సంవాదం చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ జూనియర్ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ, 'తొలిసారి ఎమ్మెల్యేలు అయ్యారు. ఇంకా చాలా చూడాల్సి ఉంది. అప్పుడే తొందరపడితే ఎలా?' అని ఆయన హితవు పలికారు.
వైఎస్సార్సీపీ నేతలు ఇంకా నినాదాలు చేయడంపై బాబు నవ్వుతూ, 'ప్రపంచానికే పాఠాలు చెప్పిన నాకే పాఠాలు చెప్పాలనుకోవడం హాస్యాస్పదం' అన్నారు. తల్లి కాంగ్రెస్ ను పిల్ల కాంగ్రెస్ బాగా అనుకరిస్తోందని ఆయన అన్నారు. పధ్ధతి ప్రకారం విద్యావ్యవస్థను క్రమబద్ధీకరించామని అన్నారు. విద్యుత్ శాఖపై ప్రతి రోజు సమీక్షించేవాడినని ఆయన అన్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని రోజుల్లో విద్యుత్ వ్యవస్థను సరిదిద్దామని చెప్పారు. లోటు బడ్జెట్ నుంచి సర్ ప్లస్ బడ్జెట్ సాధించామని అన్నారు.