: దర్శకులు మా కథలను తస్కరిస్తున్నారు: కోన వెంకట్ ఆరోపణ
టాలీవుడ్ లో దర్శకులు, కథా రచయితల మధ్య వివాదం రగులుకుంది. తమ కథలను దర్శకులు తస్కరిస్తున్నారని రచయితలంటుంటే.. 'అబ్బెబ్బే రచయితల్లో పెద్దగా టాలెంటు లేద'ని దర్శకులు ప్రత్యారోపణలు చేస్తున్నారు. కొందరు దర్శకులు కథలను తస్కరిస్తూ వాటిని తామే సృజించినట్టు స్క్రీన్ పై వారి పేర్లే వేసుకుంటున్నారని ప్రసిద్ధ సినీ రచయిత కోన వెంకట్ అంటున్నారు.
ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన ఆరోపణలు చేశారు. చిత్ర పరిశ్రమలో రచయితలకు దర్శకుల నుంచి పెద్దగా గుర్తింపు ఉండడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కోన వెంకట్ ఆరోపణలకు దర్శకుల సంఘం ఘాటుగా స్పందించింది. ఫిలిం చాంబర్ లో సమావేశమైన దర్శకుల సంఘం ప్రతినిధులు అసలు కోన వెంకట్ లో టాలెంటే లేదని కౌంటర్ విసిరారు.