: లేజర్ ట్రీట్ మెంట్ కెళితే వాతలు పడ్డాయి!
హైదరాబాదులోని ఓ క్లినిక్ లో లేజర్ ట్రీట్ మెంట్ కెళ్ళిన ఓ యువతి ముఖం నిండా వాతలతో తిరిగొచ్చింది. అమెరికాలోని షికాగోలో నివసించే చందన అనే యువతి ఇటీవలే హైదరాబాదులోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. లేజర్ హెయిర్ రిమూవర్ ట్రీట్ మెంట్ కోసం హైటెక్స్ లోని 'రీషేప్ నాన్ సర్జికల్ కాస్మొటిక్స్ క్లినిక్'ను ఆశ్రయించింది. ఈ నెల 18న ట్రీట్ మెంట్ కోసం క్లినిక్ వెళ్ళింది. అక్కడి నిపుణులు ఆమె ముఖానికి జెల్ పూసి లేజర్ మెషీన్ తో చికిత్స చేశారు. అయితే, చికిత్స వికటించి ఆమె ముఖంపై గాయాలయ్యాయి. నల్లగా వాతలతో ముఖం కమిలిపోయింది. వెంటనే చందన అపోలో ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకుంది. అనంతరం, పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు క్లినిక్ యాజమాన్యాన్ని అరెస్టు చేశారు.