: మీ పార్ట్ నర్ ఇలాంటివాడా..?
మనదేశంలోనూ డేటింగ్ సంస్కృతి క్రమంగా విస్తరిస్తోంది. దాని తాలూకు సత్ఫలితాల కంటే దుష్పరిణామాలే ఎక్కువగా వినిపిస్తున్నా, యువత మోజు డేటింగ్ పైనే. ఇలాంటి సంబంధాల్లో ఎక్కువగా నష్టపోయేది అమ్మాయిలేనని సామాజికవేత్తల అభిప్రాయం. అందుకే అమ్మాయిలు తగిన జోడు కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఓ యువతి తాను డేటింగ్ చేస్తున్న వ్యక్తి పరిణతి చెందినవాడా? కాదా? అన్న విషయం ఈ కింది లక్షణాల ఆధారంగా చెప్పేయొచ్చట. అవేంటంటే...
బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నా, తప్పులను ఒప్పుకునేందుకు సిద్ధపడకున్నా అతగాడు పరిణతి సాధించనట్టే లెక్క. ఇలాంటివాళ్ళు ఇతరుల తప్పులను ఎత్తిచూపేందుకు ప్రాధాన్యం ఇస్తారట. ఇక ఉద్యోగాల్లో నిలకడలేమి, అనుబంధం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాడంటే 'మిస్టర్ వేస్ట్' గానే భావించాల్సి ఉంటుంది! అన్నింటికి మించి భవిష్యత్తు కోసం ప్రణాళికలు లేకుండా, కీలక నిర్ణయాలు తీసుకునే భారం భాగస్వామిపై మోపే వాళ్ళు ఎన్నటికీ సరైన భాగస్వాములు కాలేరు. దురదృష్టవశాత్తూ ఇలాంటి వ్యక్తితో పెళ్ళయిపోతే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం.
అతని బాధ్యతారాహిత్యాన్ని భార్య ఎప్పుడూ సమర్థించకూడదు. అతని ప్రవర్తన పర్యవసానాలను అతనే అనుభవించేలా వ్యవహరించాలి. అయితే, ఇలాంటి సమయాల్లో అతనిపై నోరు చేసుకోవడం, సుదీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వడం మంచిదికాదు. దాంపత్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇరువురి నడుమ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. కుటుంబం కోసం తీసుకునే నిర్ణయాల్లో అతడినీ భాగస్వామిని చేయడం అతనిలో భాధ్యతను పెంచుతుంది. ఇలాంటి చర్యలతో క్రమేపీ అతనిలో మార్పు తేవచ్చని సామాజికవేత్తలు అంటున్నారు. ఇక చివరి ప్రయత్నంగానే ఫ్యామిలీ కౌన్సిలర్ ను ఆశ్రయించడం మంచిదని వారి అభిప్రాయం.