: ఆ సిగరెట్లే యువతను ఆకర్షిస్తున్నాయి
పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్... అంటూ కన్యాశుల్కంలో గీరీశం మహాశయుడు సెలవిచ్చిన వైనాన్ని అధికశాతం యువతరం అక్షరాల పాటిస్తున్నారు. గుప్పుగుప్పున పొగవదులుతూ స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడడం ఓ స్టైల్... ఒత్తిడి పేరు చెప్పి కార్పోరేట్ ఆఫీసు బయట పాన్ షాపు ముందు దమ్ముకొట్టి రిలీఫ్ ఫీలైపోవడం మరి కొంత మంది స్టైల్! ఏదయితేనేం, స్టైల్ కొట్టడానికి సిగిరెట్ కావాలి!
ఇలా సిగరెట్లు కాల్చే ప్రతి యువకుడు ప్రారంభంలో మెంథాల్ సిగిరెట్లు కాలుస్తారు. రెగ్యులర్ సిగరెట్ల కంటే మెంథాల్ సిగరెట్లు హానికారం కాదని కొత్త వారికి క్లాసు కూడా పీకుతారు. ఆ అభిప్రాయం పూర్తిగా తప్పని కెనడాలోని వాటర్లూ యూనివర్సిటీ నిరూపించింది. క్యాన్సర్ పరిశోధనల్లో భాగంగా, యువతరం తీవ్రంగా ప్రభావితమవుతున్న సిగరెట్లపై శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. రెగ్యులర్ సిగరెట్ల కంటే మెంథాల్ సిగరెట్లే ప్రమాదకరమని వారు నిర్ధారించారు.
మెంథాల్ సిగరెట్లు తాగే యువకులు వాటిలో వాడే ఫ్లేవర్ల కారణంగా ఎక్కువ కాలం అవే సిగరెట్లు తాగే అవకాశం ఉందని తెలిపారు. దీని కారణంగా ఎక్కువ పొగతాగుతున్నారని పరిశోధకులు స్పష్టం చేశారు. అదనపు రుచి చేర్చే బ్రాండెడ్ సిగరెట్లను నిషేధించాలని వారు డిమాండ్ చేశారు.