: వివాదాస్పదం చేసి... లబ్ది పొందుదామని చూస్తున్నారు: కాల్వ శ్రీనివాసులు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ, హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో మృతి చెందిన విద్యార్థుల మృతికి సంతాపం తెలుపుతూ తీర్మానం పెట్టామని అన్నారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్ లకు అభినందనలు తెలుపుతూ తీర్మానం చేశామని తెలిపారు. సత్వరమే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఒక తీర్మానం ప్రవేశపెట్టామని ఆయన వెల్లడించారు.
ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు బిల్లు తొలి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నామని ఆయన స్పష్టం చేశారు. శాసనసభలో తక్కువ పార్టీల ప్రాతినిధ్యం ఉన్న సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులుగా ఏడుగురికే బీఏసీలో స్థానం కల్పించారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవిభజన కారణంగా 11 మంది ఉండాల్సిన బీఏసీ సభ్యుల సంఖ్యను, ఏడుగురు సభ్యులకే స్పీకర్ పరిమితం చేసినట్టు ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, చీఫ్ విప్, మంత్రి దేవినేని ఉమ, బీజేపీ నుంచి ఒక శాసన సభ్యుడికి, ఇద్దరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు బీఏసీలో సభ్యత్వం కల్పించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి బీఎసీలో ఇద్దరికే అవకాశం కల్పించడం సంప్రదాయమని ఆయన వెల్లడించారు. అందుకు అనుగుణంగానే ఇద్దరికి అవకాశం ఇచ్చారని తెలిపారు. బీఏసీ సమావేశంలో ప్రాతినిధ్యం కోసం పేర్లు సూచించమంటే వైఎస్సార్సీపీ స్పందించలేదని ఆయన విమర్శించారు.
ముగ్గురికి అవకాశం కల్పించాలని స్పీకర్ ను వైఎస్సార్సీపీ కోరిందని కాల్వ శ్రీనివాసులు చెప్పారు. స్పీకర్ పెద్ద మనసుతో ఆ పార్టీలో ముగ్గురు సభ్యులు బీఏసీ సమావేశంలో పాల్గొనేందుకు అవకాశమిచ్చినా గైర్హాజరై వివాదం చేసేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. బాధ్యత మరచి, వివాదాలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.