: పాక్ లో పెరిగిన మానవ అక్రమ రవాణా... చైనా కొంత బెటర్: అమెరికా


మనుషుల అక్రమ రవాణాను నిరోధించడంలో పాకిస్తాన్ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఈ క్రమంలోనే మనుషుల అక్రమ రవాణా నిరోధక చర్యల విషయంలో అమెరికా ఆ దేశ ర్యాంకును తగ్గించింది. గతేడాది భారత్ తో కలిసి 'టైర్2' ర్యాంకులో ఉన్న పాక్ ను ఈ ఏటి జాబితాలో 'టైర్2 వాచ్ లిస్ట్' లోకి దించేసింది. టైర్2 అంటే... మనుషుల అక్రమ రవాణాను అరికట్టే విషయంలో ఆయా దేశాలు విఫలమవుతున్నప్పటికీ, నిరోధించేందుకు మాత్రం యత్నిస్తున్నాయన్న మాట. అయితే ఈ ఏడాది ఈ తరహా చర్యలు కూడా పాక్ లో మృగ్యమయ్యాయని తాజాగా విడుదల చేసిన జాబితాలో అమెరికా పేర్కొంది. పాకిస్తాన్ లో నానాటికీ దిగజారుతున్న భద్రత, బలహీన ఆర్థిక వ్యవస్థలే ఇందుకు దోహదం చేస్తున్నాయని నివేదిక విడుదల సందర్భంగా అమెరికా మంత్రి జాన్ కెర్రి శుక్రవారం చెప్పారు.

అయితే అనూహ్యంగా చైనా మాత్రం ఈ ఏటి జాబితాలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. గతేడాది 'టైర్3' కింద ఉన్న చైనా తాజా జాబితాలో 'టైర్2 వాచ్ లిస్ట్' ర్యాంకుకు ఎగబాకింది. అయితే దీనిపై అమెరికా ప్రతినిధుల సభలో విదేశీ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు ఎడ్ రాయిస్ విస్మయం వ్యక్తం చేశారు. చైనాలో ఇప్పటికీ మనుషుల అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోందని, అయినా ఆ దేశ ర్యాంకును మెరుగుపరచాల్సిన అవసరం ఏముందని కూడా ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News