: పితృత్వం మగాళ్ల మెదడునూ మార్చేస్తుంది
జన్మనిస్తుంది కాబట్టి పిల్లలను పెంచే బాధ్యత కూడా అనాదిగా తల్లిదే అవుతోంది. అందులోనే మాతృత్వపు మధురిమలను ఆమె ఆస్వాదిస్తుంది. అయితే, తండ్రి కూడా పిల్లల పెంపకాన్ని స్వీకరిస్తే అతను కూడా పితృత్వపు కమ్మదనాన్ని పొందగలుగుతాడని తాజా పరిశోధనలు తెలుపుతున్నాయి. పిల్లలను సాకడం ద్వారా తల్లిలో చోటు చేసుకునే సరికొత్త ఆలోచనా దృక్పథం, భావోద్వేగ సంబంధం వంటి మార్పులు, ఆ బాధ్యతను తీసుకునే తండ్రిలో కూడా కలుగుతున్నాయట. అయితే, తాజాగా జరిగిన పరిశోధనల్లో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చిందండోయ్. తండ్రులైన పురుషుల్లో మహిళల్లాగే హార్మోన్ల మార్పిడితో పాటు వారి మెదడు కూడా సరికొత్త రూపు దాలుస్తుందట. కొత్తగా తల్లిదండ్రులైన 89 జంటలపై ఇటీవల జరిగిన పరిశోధనల్లో ఈ ఆసక్తికర అంశం వెల్లడైనట్లు 'ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్స్' తాజా సంచికలో ప్రచురితమైన ఓ పరిశోధన కథనం తెలిపింది. పిల్లల పెంపకాన్ని పూర్తిగా భుజాన వేసుకున్న తండ్రుల మెదడు తల్లుల మెదడు స్పందనలతో సరిసమానంగా స్పందిస్తుందట. ఇదివరకటి పరిశోధనల్లో కొత్తగా తండ్రులైన పురుషుల్లో ఈస్ట్రోజన్, ఆక్సిటోసిన్, ప్రొలాక్టిన్, గ్లూకోకొట్రికాయిడ్స్ తదితర హార్మోన్ల విడుదలలో కొంత మెరుగుదల నమోదైనట్లు తేలింది.