: జగన్ కంపెనీల్లోకి హవాలా నిధుల నిగ్గు తేల్చిన సీబీఐ
జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కీలక పురోగతి సాధించింది. జగన్ కంపెనీల్లోకి హవాలా మార్గాల్లో రూ. 55 కోట్ల మేర నిధులు ప్రవహించినట్టు తేల్చింది. దాల్మియా సిమెంట్స్ కంపెనీ ఒక్కటే ఈ సొమ్మును అక్రమంగా జగన్ కంపెనీల్లోకి మళ్ళించినట్టు సీబీఐ నిర్ధారించింది. దీంతో, వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పొందిన మేళ్ళకు ప్రతిఫలంగానే ఈ పెట్టుబడులు పెట్టినట్టు స్పష్టమైంది.
అప్పట్లో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి దాల్మియా సిమెంట్స్ కు అనుమతులు మంజూరు చేయడంలో చూసీచూడనట్టు వదిలేశారని సీబీఐ తన విచారణలో నిగ్గు తేల్చింది. ఇందుకు ప్రతిగా దాల్మియా సిమెంట్స్ మొత్తం రూ. 95 కోట్ల నిధులను జగన్ కు చెందిన రఘురామ్ సిమెంట్స్ లో పెట్టుబడి పెట్టగా అందులో రూ. 55 కోట్లు హవాలా మార్గాల్లో వచ్చినవేనని తెలుస్తోంది. రఘురామ్ సిమెంట్స్ ఆ తర్వాతి కాలంలో భారతి సిమెంట్స్ గా పేరు మార్చుకుంది. శనివారం దాఖలు చేసిన ఛార్జిషీటులో సీబీఐ ఈ వివరాలు పొందుపరిచింది.