: శోభానాగిరెడ్డి నాకు అక్కలాంటిది: జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దివంగత నేత శోభానాగిరెడ్డి సంతాపతీర్మానం సందర్భంగా వైెఎస్సార్సీపీ అధినేత జగన్ భావోద్వేగానికి లోనయ్యారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, శోభానాగిరెడ్డి తనకు అక్క లాంటివారని అన్నారు. తన తండ్రి మరణం తరువాత రాజకీయంగా అంతరించిపోతామని విమర్శలు వచ్చినప్పుడు ఆమె తనకు తోడుగా నిలిచారని ఆయన గుర్తు చేసుకున్నారు. గుంటూరు పర్యటనలో ఉండగా ఆమెకు ప్రమాదం జరిగిందని తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన తెలిపారు. అసెంబ్లీలో ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తుందని తానెన్నడూ ఊహించలేదని ఆయన అన్నారు.
ఆమె కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. శోభమ్మ ఎక్కడున్నా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ, చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయిన ఆమె, తాగునీరు, రైతు సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు చేశారని అన్నారు. సౌమ్యశీలి, స్నేహశీలిగా అందరి మన్ననలు పొందిన ఆమె లేకపోవడం దురదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.