: రాష్ట్రాలుగా విడిపోయినా, తెలుగు జాతి ఒక్కటే: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో జరిగిన ఉద్యోగుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఉద్యోగులంతా ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నామని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ వచ్చాక తెలుగువారి ఆత్మగౌరవం ప్రపంచానికి తెలిసిందని అన్నారు. టీడీపీ పాలనలో హైదరాబాదుకు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. తన వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్ వచ్చిందని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. తమ పాలనలో ఉద్యోగులెవరికీ హాని కలగదని, ఉద్యోగులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. కొత్త రాజధాని అంశంలో అనేక విషయాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా... తెలుగు జాతి అంతా ఒక్కటేనని బాబు స్పష్టం చేశారు. అయితే కొందరు విద్వేషాలు కలిగించేలా ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఇది సరికాదన్నారు.

యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హేతుబద్ధంగా లేదని చంద్రబాబు అన్నారు. రెండు రాష్ట్రాలకూ సమాన స్థితి కల్పించేలా మోడీ ప్రభుత్వం చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులను ఒక్కసారిగా వెళ్లమంటే చాలా ఇబ్బంది పడతారని అన్నారు. ఐదేళ్ల పాటు అందరం కలిసి కష్టపడదామని ఆయన పిలుపునిచ్చారు. తనను ముందుకు నడిపించమని, ఉద్యోగులకు అండగా ఉంటానని ఆయన చెప్పారు. సముద్రంలో వృథాగా నీరు పోతుందనే పోలవరం నిర్మిస్తున్నామని చెప్పారు. పోలవరం వల్ల ఇతర రాష్ట్రాలకూ మేలు చేకూరుతుందన్నారు.

  • Loading...

More Telugu News