: మున్నాభాయ్ కోసం 'మున్నాభాయ్' వెయిటింగ్..!
'మున్నాభాయ్ ఎంబీబీఎస్', 'లగే రహో మున్నాభాయ్' చిత్రాలతో బాలీవుడ్ లో తన రేంజిని పెంచుకున్న హీరో సంజయ్ దత్. విలక్షణ కథాంశాలతో తెరకెక్కిన ఆ రెండు చిత్రాలు నిర్మాతకు కలెక్షన్ల వర్షం కురిపించడంతోపాటు.. సంజయ్ దత్ కెరీర్లో సూపర్ హిట్లుగా నిలిచిపోయాయి. ఇప్పుడా సినిమాలకు మరో సీక్వెల్ తీసేందుకు దర్శకనిర్మాతలు సిద్ధమవుతున్నారు. అయితే, సంజయ్ దత్ ముంబయి వరుస పేలుళ్ళ కేసులో ఐదేళ్ళ జైలుశిక్షకు గురవడంతో ఈ ప్రాజెక్టు ఇప్పట్లో కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపించడంలేదు.
కానీ, సంజూ వచ్చేదాకా తాము ఎదురుచూస్తామని నిర్మాత రాజ్ కుమార్ హిరానీ, దర్శకుడు విధు వినోద్ చోప్రా చెబుతున్నారు. ఈ విషయమై వారిద్దరూ ఏమంటున్నారో వినండి. 'రియల్ మున్నాభాయ్ కోసం రీల్ మున్నాభాయ్ ఎదురుచూస్తున్నాడు' అని వ్యాఖ్యానించారు. ఇక సంజయ్ దత్ కూడా ఈ సినిమా విషయమై ఈ ద్వయంతో మాట్లాడినట్టు తెలుస్తోంది. తాను జైలుకెళ్లడం దాదాపు ఖరారైనట్టే అని నిర్ధారించుకున్న సంజయ్ దత్.. శిక్ష పూర్తయి కారాగారం నుంచి బయటికొచ్చిన మరుక్షణం నేరుగా మున్నాభాయ్-3 సెట్స్ వద్దకే వస్తానని చెప్పాడట. ఈ నేపథ్యంలో హిరానీ, చోప్రా.. సంజయ్ విషయంలో ప్రభుత్వం కొంచెం ఉదారంగా వ్యవహరించాలని అభ్యర్థిస్తున్నారు.