: ఆసుపత్రుల్లోని ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరిస్తా: రాజయ్య
హైదరాబాదులోని ఎం.ఎన్.జె క్యాన్సర్ హాస్పిటల్ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్యను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ... ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షేత్ర స్థాయిలో జరిగే అవకతవకల గురించి, అక్కడి సమస్యల గురించి ఒక డాక్టరుగా తనకు సమగ్రమైన అవగాహన ఉందని అన్నారు. ఆసుపత్రుల్లో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కేబినెట్ లో సీఎం నిర్ణయం తీసుకుంటారని అన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించి రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. సీమాంధ్రలో చాలా క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయని, తెలంగాణలోని ఒకే ఒక క్యాన్సర్ ఆసుపత్రి అయిన ఎం.ఎన్.జె. క్యాన్సర్ ఆసుపత్రిని కాపాడుకుంటామని ఆయన చెప్పారు. ఇక్కడ ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని రాజయ్య హామీ ఇచ్చారు.