: ట్రాఫిక్ ను ఆపేశారు ... గుండెను ఆగనివ్వలేదు!
ట్రాఫిక్ సినిమా చూశారా? అందులోని సన్నివేశంలా చెన్నైలో ఓ సంఘటన చోటు చేసుకుంది. వైద్యులు, పోలీసులు సంయుక్తంగా జరిపిన ఈ ఆపరేషన్ లో ఓ వ్యక్తి అమరజీవి అయితే, మరో వ్యక్తి పునర్జన్మ పొందాడు. వివరాల్లోకి వెళితే... చెన్నైలోని ప్రభుత్వాసుపత్రి నుంచి ఫోర్టిస్ మలార్ ఆసుపత్రికి ఉదయం 5.45 నిమిషాలకు ఓ ఫోన్ వచ్చింది. దాని సారాంశమేంటంటే... ఓ రోగి దాదాపు బ్రెయిన్ డెడ్ పరిస్థితుల్లో ఉన్నాడని, అతడి గుండెను తీసుకోవచ్చని. ఫోర్టిస్ ఆసుపత్రిలో చాలా కాలంగా ఓ రోగి గుండె మార్పిడి కోసం ఎదురు చూస్తున్నాడు. దీంతో ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఫోర్టిస్ ఆసుపత్రికి ఫోన్ చేసి సమాచారమందించారు.
ఫోర్టిస్ ఆసుపత్రి నుంచి ప్రభుత్వాసుపత్రికి 12 కిలో మీటర్ల దూరం ఉంటుంది. చెన్నైలో ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది. ఎలా వెళ్లాలన్నా 45 నుంచి 50 నిమిషాల ప్రయాణం. దీంతో వైద్యులకు ఏం చేయాలో పాలుపోలేదు. అందుకు కారణం, మనిషి శరీరం నుంచి వేరు చేసిన గుండెను అన్ని జాగ్రత్తలు తీసుకుని సురక్షితంగా ఉంచితే, ఆ గుండె నాలుగు గంటల వరకే పని చేస్తుంది.
అలాంటిది గుండెను సర్జరీ చేసి ఒక వ్యక్తి శరీరం నుంచి వేరు చేయాలి. దానిని సురక్షితంగా తీసుకెళ్లి మరో మనిషి శరీరంలో అమర్చాలి. ఇదంతా కేవలం నాలుగు గంటల్లోనే జరగాలి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలి. దీంతో ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు పోలీసులను సంప్రదించారు. 12 కిలో మీటర్ల దూరంలోని 12 ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు మోహరించి గ్రీన్ లైట్ అనేది వెలగకుండా ఉండేలా ట్రాఫిక్ నియంత్రించారు.
ప్రభుత్వాసుపత్రి నుంచి అంబులెన్సు ఉదయం 6.44 నిమిషాలకు బయల్దేరింది. దాని ముందు పోలీసుల పైలట్ వాహనం కూడా బయల్దేరింది. ఈ రెండు వాహనాలు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయాయి. దీంతో కేవలం 13 నిమిషాల్లో అంటే 6.57 నిమిషాలకల్లా ఫోర్టిస్ ఆసుపత్రికి గుండె భద్రంగా చేరింది. అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్యులు సర్జరీ పూర్తి చేసి ఊపిరి పీల్చుకున్నారు. ఈ రకంగా గుండె త్యాగం చేసి ఓ మనిషి అమరజీవిగా మారితే, మరో మనిషి అతని గుండెను అమర్చుకుని పునర్జన్మ పొందాడు.