: సాక్ష్యాలు దొరకడం లేదు: ప్రీతి జింటా కేసులో పోలీసులు
బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో, ఐపీఎల్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు యాజమాన్య భాగస్వామి, వ్యాపారవేత్త నెస్ వాడియాకు గొడవ ఎక్కడ జరిగిందో తమకు స్పష్టంగా తెలియాలని ముంబై పోలీసులు అంటున్నారు. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా సీసీ కెమెరా పుటేజ్ లో ఘటనకు సంబంధించిన వివరాలు దొరకలేదని పోలీసులు స్పష్టం చేశారు. గొడవ ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు మరోసారి ప్రీతి జింటాను ప్రశ్నించనున్నామని పోలీసులు తెలిపారు.
గ్యాలరీ ముందు భాగంలో ప్రీతి జింటా ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రీతి చెప్పిన ఇద్దరు సాక్షుల నుంచి రేపు వివరాలు సేకరిస్తామని అన్నారు. కాగా, ప్రీతి జింటా కెరీర్ ఆరంభం నుంచి కొన్ని వివాదాలు బాలీవుడ్ లో సంచలనం సృష్టించాయి. 'దిల్ సే' సినిమాతో ఎంట్రి ఇచ్చిన ప్రీతి జింటా, ఆ సినిమా షూటింగ్ లో 'షారూఖ్ ఖాన్, నీవు బ్రహ్మచారివేనా?' అంటూ ప్రశ్నించి సంచలనానికి తెరతీసింది.
2003లో అండర్ వరల్డ్ మాఫియాపై కోర్టులో ధైర్యంగా ఫిర్యాదు చేసి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతకు ముందు బాలీవుడ్ లో ఏ సినిమా హీరో, హీరోయిన్ ఇలా ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు.
2005లో ఓ టీవీ ఛానెల్ సల్మాన్ ఖాన్ గొంతును అనుకరిస్తూ తనపై అమర్యాదకర వ్యాఖ్యలు చేసిందంటూ పరువు నష్టం కేసు వేసింది.
'ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ తో తన వైవాహిక జీవితానికి తెరపడటానికి కారణం ప్రీతి జింటా' అంటూ అతని భార్య సుచిత్రా కృష్ణమూర్తి ఆరోపించింది. దీనికి దీటుగా ప్రీతి స్పందిస్తూ, సుచిత్ర మానసిక స్థితి సరిగా లేదంటూ వ్యాఖ్యానించింది. ఇలా ఎప్పుడూ తను వివాదాలతోనే సావాసం చేస్తూ వచ్చింది!