: ఆమె చదివింది ఎనిమిదే... పిల్లల్ని మాత్రం సివిల్స్ అధికారుల్ని చేసింది!
ఆమె చదివింది ఎనిమిదో తరగతే... అయినా, చాలామంది తల్లిదండ్రుల్లా తన పిల్లలను ఏదో ఒక ఉద్యోగంలో చూడాలని కాకుండా... సివిల్ సర్వీసెస్ అధికారులుగా చూడాలని భావించింది. తండ్రి లేని ముగ్గురు పిల్లలను సాకి వారిని సివిల్ సర్వీసెస్ అధికారులుగా చేసింది. రాజస్థాన్ లోని మారుమూల గ్రామంలో ఉండే మాయాదేవిది సామాన్య రైతు కుటుంబం. పిల్లలు చిన్నవాళ్లుగా ఉన్నప్పుడే ఆమె భర్త మరణించాడు. దీంతో ముగ్గురు పిల్లల పెంపకం బాధ్యతలు ఆమెపై పడ్డాయి. అయినా సరే అధైర్యపడక వారిని ఉన్నత స్థానాలలో నిలపాలని భావించింది.
తను కష్టపడుతూ పిల్లలకు ఏ లోటూ రానీయకుండా పెంచింది. కష్టపడితే ఎవరైనా ఏదైనా సాధించవచ్చన్న స్పూర్తిని పిల్లల్లో నింపింది. ఉన్నత విద్యకు ఢిల్లీ పంపింది. తల్లి కష్టాన్ని, బాధ్యతను గుర్తెరిగిన ముగ్గురు పిల్లలూ తల్లి కోరుకున్నట్టుగానే సివిల్ సర్వీసెస్ అధికారులయ్యారు. పెద్ద కుమార్తె క్రాంతి యూపీఎస్సీ పరీక్షలు పాసై ముంబైలో ఆదాయపన్ను శాఖ డిప్యూటీ కమిషనర్ గా విధులు నిర్వర్తిస్తోంది. కుమారుడు లోక్ బంధు, చిన్న కుమార్తె పూజ కూడా యూపీఎస్సీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించారు.
వారికి ఐఏఎస్ కేడర్ ఉద్యోగాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆమె కన్న కలలు నిజమయ్యాయి. పిల్లలను పెంచడం ప్రతి తల్లిదండ్రులు చేస్తారు... బాధ్యతలు నిరంతరం గుర్తు చేస్తుంటే పిల్లలు మంచి ఫలితాలు సాధిస్తారని ఆ ఆదర్శ తల్లి అంటోంది.