: తెలంగాణ శకుంతల అంత్యక్రియలు పూర్తి
ప్రముఖ సినీ నటి తెలంగాణ శకుంతల అంత్యక్రియలు సికింద్రాబాదు ఆల్వాల్ లోని స్మశాన వాటికలో పూర్తయ్యాయి. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించిన తెలంగాణ శకుంతలకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ నివాళులర్పించింది. ఆమె భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం కొంపల్లిలోని ఇంటి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. సినీ నిర్మాత రామానాయుడు, గద్దర్, సినీ నటులు వేణుమాధవ్, హేమ, ఝాన్సీ తదితరులు ఆమెకు నివాళులర్పించారు. అనంతరం అంతిమ యాత్ర నిర్వహించి ఆల్వాల్ లోని స్మశాన వాటికలో అంత్యక్రియలను పూర్తి చేశారు. సుమారు 74 చిత్రాల్లో నటించిన శకుంతల ప్రస్తుతం ఆర్.నారాయణమూర్తి నిర్మించిన 'రాజ్యాధికారం' సినిమాలో కీలకపాత్ర పోషించారు. ఆ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.