: హైదరాబాదులో హలీం ఘుమఘుమలు
షబ్-ఎ-బరాత్ రంజాన్ మాసానికి 15 రోజుల ముందు వస్తుంది. దీన్ని ముస్లింలు, వ్యాపారులు రంజాన్ మాసానికి స్వాగతంలా భావిస్తారు. షబ్-ఎ-బరాత్ ను పురస్కరించుకుని ముస్లింలు శుక్రవారం నాడు హైదరాబాదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మక్కామసీదు, పబ్లిక్ గార్డెన్ లోని షాహీ మసీదు, ముషీరాబాదు, ఖైరతాబాదులోని జామా మసీదు తదితర మసీదులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. షబ్-ఎ-బరాత్ సందర్భంగా నగరంలోని పలు హోటళ్లలో హలీం అమ్మకాలు పెద్ద ఎత్తున కొనసాగాయి. హలీం ప్రియులు పెద్ద సంఖ్యలో హలీంను ఎంతో ఇష్టంగా ఆరగించారు. ఈ నెల 30వ తేదీ నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతోంది.
బంజారాహిల్స్ లోని సర్వీ హోటల్ లో శుక్రవారం నాడు హలీం 60 ఏళ్ల సంబరాలను ప్రారంభించారు. పాతబస్తీలోని మదీన హోటల్ లో 1953లోనే తొలిసారి హలీం విక్రయాలను ప్రారంభించినట్లు సర్వీ హోటల్ యజమాని అలీ సర్వీ తెలిపారు. రంజాన్ మాసం ముగిసే వరకు హలీం విక్రయాలు కొనసాగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈసారి నగరంలోని 50 చోట్ల మాత్రమే సర్వీ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంకెందుకు ఆలస్యం, నోరూరించే హలీంను రుచి చూసేందుకు సిద్ధమవ్వండి మరి!