: రక్తదానం చేయండి... సాటి మనిషి ప్రాణాలు కాపాడండి
ప్రపంచ దేశాలు ఇవాళ ‘ప్రపంచ రక్తదాతల దినోత్సవం' జరుపుకుంటున్నాయి. 2004 సంవత్సరం నుంచి ప్రతి యేటా జూన్ 14వ తేదీన రక్తదాన ప్రాధాన్యతను తెలుపుతూ, రక్తదానంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాదులోనూ పలుచోట్ల రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. ‘రక్తదానం చేయండి... సాటి మనిషి ప్రాణాలు కాపాడండి’ అంటూ పలు స్వచ్ఛంద సంస్థలు పిలుపునిస్తున్నాయి. నగర యువత కూడా అందుకు స్పందించి రక్తదాన శిబిరాల్లో చురుకుగా పాల్గొంటోంది.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల రక్తదాతలు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనవచ్చని వారు చెప్పారు. ఎన్టీఆర్ రక్తనిధికి ప్రతియేటా రక్తదానం చేస్తున్న వారిని ఇవాళ సన్మానించనున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో కొండయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత ముఖ్యఅతిథిగా హాజరవుతున్నట్లు వారు చెప్పారు.