: భారత ఇంజనీరింగ్ పట్టాలకు అంతర్జాతీయ గుర్తింపు
భారత ఇంజనీరింగ్ విద్యకు అంతర్జాతీయంగా ఇకపై శాశ్వత గుర్తింపు ఉంటుంది. వాషింగ్టన్ ఒప్పందంలో భారత్ శాశ్వత సభ్యదేశంగా చేరిపోయింది. 1989లో అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందంపై ఇప్పటి వరకు 17 దేశాలు సంతకాలు చేసి శాశ్వత సభ్యదేశాలుగా చేరాయి. ఇకపై ఈ దేశాలు భారత ఇంజనీరింగ్ పట్టాల (ఐటీ విద్య మినహా)ను గుర్తించడంతోపాటు, తమ దేశాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు భారత ఇంజనీర్లను అనుమతిస్తాయి. 2007 నుంచి వాషింగ్టన్ ఒప్పందంలో మనదేశం తాతాల్కిక సభ్య దేశంగా ఉంది. ఈ ఒప్పందంలో చేరాలంటే ఇంజనీరింగ్ విద్యలో ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి పెంచుకోవాల్సి ఉంటుంది.
అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, కెనడా, జపాన్, ఐర్లాండ్, మలేసియా, న్యూజిలాండ్, బ్రిటన్, దక్షిణాఫ్రికా, టర్కీ, దక్షిణ కొరియా, రష్యా, చైనీస్ తైపీ, హాంగ్ కాంగ్ చైనా కూడా వాషింగ్టన్ ఒడంబడికలో శాశ్వత సభ్యులుగా ఉన్నాయి. బంగ్లాదేశ్, జర్మనీ, పాకిస్థాన్, శ్రీలంక, ఫిలిప్పీన్స్ తాతాల్కిక సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇక, మనదేశ ఐటీ ఇంజనీర్లు మాత్రం ఈ ఒప్పందంలో చేరడం వల్ల ఉద్యోగావకాశాలు పెరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఐటీ విద్య మాత్రం సియోల్ ఒప్పంద పరిధిలోకి వస్తుంది. దీంతో భారత్ ఇందులో కూడా చేరాల్సి ఉంటుంది.