: ఆలయాల్లో నిత్యాన్నదానం అమలు చేయండి: ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదేశం
ద్వారకా తిరుమల, అన్నవరం, శ్రీశైలం సహా ఏడు ప్రముఖ దేవాలయాల్లో నిత్యాన్నదాన పథకాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ మంత్రిగా నియమితులైన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం వచ్చిన ఆయనను ఆ శాఖ ఉన్నతాధికారులు ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా రోజుకు కనీసం 5 వేల మందికి అన్నదానం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఆయా దేవాలయాలకు ప్రతి రోజు వస్తున్న భక్తుల సంఖ్య, దేవాలయాల ఆదాయ వ్యయాలను 20 రోజుల్లోగా తనకు సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా విజయవాడ, ద్వారకా తిరుమల తదితర ప్రాంతాల దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, అర్చకులు మంత్రిని సన్మానించారు.