: విశాఖలో తొలి మంత్రివర్గ సమావేశం జరగడం చారిత్రాత్మకం: చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. విశాఖలో తొలి మంత్రివర్గ సమావేశం జరగడం చారిత్రక విషయమని బాబు అన్నారు. గుంటూరు వద్ద ప్రమాణ స్వీకారం చేశామని, విశాఖపట్నంలో మంత్రివర్గ సమావేశం పెట్టామని ఆయన చెప్పారు. ఈ సమావేశ నిర్ణయాలను చంద్రబాబు వెల్లడించారు. విశాఖను మెగా సిటీగా మార్చేందుకు ప్రణాళికను రూపొందించమని కలెక్టర్ ను ఆదేశించామని ముఖ్యమంత్రి చెప్పారు. దేశంలోనే అద్భుతమైన నగరం విశాఖపట్నం అని ఆయన కితాబు ఇచ్చారు. విశాఖకు మెట్రో రైలు రావాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎజెండాలో మొదటి అంశం రైతు రుణమాఫీ అని, రాష్ట్ర విభజన తర్వాత కూడా రైతులకు ఇబ్బందులున్నాయని చంద్రబాబు అన్నారు. ఖరీఫ్ సీజన్ లో రైతులను ఆదుకోవాలని, ఖరీఫ్ సీజన్ లో రైతులకు రుణాలు మళ్లీ ఇవ్వాలని ఆయన చెప్పారు. రెండో అంశం ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకమని, తాగునీరు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖతో ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి కమిటీ వేయనున్నట్లు ఆయన చెప్పారు. జిల్లాల్లో పట్టణాలు, గ్రామాలను అనుసంధానం చేసి త్రాగునీరు అందించనున్నట్లు ఆయన తెలిపారు. మూడో అంశం బెల్టు షాపుల రద్దు అని, బెల్టు షాపులు ఎక్కడున్నా మూసివేయమని ఆదేశాలిస్తామని చంద్రబాబు చెప్పారు. బెల్టు షాపుల మూసివేతకు ఎక్సైజ్ చట్టాన్ని సవరించనున్నట్లు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News