: 'గుజరాత్ నమూనా... భారత్ అభివృద్ధి' అని నినాదం ఇచ్చాం: నరేంద్ర మోడీ
ప్రజలు సుస్థిర ప్రభుత్వానికి మద్దతిచ్చారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాజ్యసభలో మోడీ ఇవాళ మాట్లాడారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. కొత్త ఆశలతో భారత్ ప్రగతిపథంలో పయనిస్తుందని ఆయన చెప్పారు. బలమైన భారత్ ను ప్రజలు కోరుకుంటున్నారన్నారు. గుజరాత్ నమూనా... భారత్ అభివృద్ధి అని నినాదమిచ్చామని అన్నారు. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సంబంధాలు బలంగా ఉండాలని ఆయన చెప్పారు. ప్రధాని, ముఖ్యమంత్రులు కలిసి టీమిండియాగా ఏర్పడి అభివృద్ధికి తోడ్పడాలని ఆయన ఆకాంక్షించారు.
రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలని మోడీ అన్నారు. గుజరాత్ లో ప్రతి జిల్లాకు ప్రత్యేక నమూనాను తయారుచేశామని, అన్ని విషయాలు పరిశీలించి ఈ నమూనాను రూపొందించినట్లు ఆయన చెప్పారు. రాష్ట్రాలు వివాదాలు వీడి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని ఆయన కోరారు. అభివృద్ధిలో ఏ రాష్ట్రం కూడా వెనుకబడకూడదన్నది తమ ఉద్దేశ్యమన్నారు. ఈశాన్య భారతంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు. ఏక్ తా భారతం కోసం సమష్టిగా పనిచేయాలన్నారు.