: తదుపరి ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగే: జైట్లీ
సైనిక దళాల తదుపరి ప్రధానాధికారి దల్బీర్ సింగ్ సుహాగేనని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. సాయుధ దళాలకు సంబంధించిన నిర్ణయాలను రాజకీయం చేయరాదన్నారు. ప్రస్తుతం దల్బీర్ సింగ్ ఆర్మీ వైస్ చీఫ్ గా ఉన్నారు. ఈయనను ఆర్మీ తదుపరి చీఫ్ గా నియమిస్తూ ఎన్నికల ముందు యూపీఏ సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న వీకేసింగ్ గతంలో ఆర్మీ చీఫ్ గా ఉన్నప్పుడు దల్బీర్ సింగ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. దీన్ని కారణంగా చూపుతూ దల్బీర్ సింగ్ కు పదోన్నతి కల్పించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, వీకేసింగ్ తీసుకున్న చర్యలు చట్టవిరుద్ధమని తాజాగా రక్షణ శాఖ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. దీన్ని కాంగ్రెస్ అవకాశంగా తీసుకుని కేంద్రంపై విమర్శలకు దిగింది. దీంతో అరుణ్ జైట్లీ రక్షణ శాఖ అధికారులను వివరణ కోరారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు జైట్లీని కలసి వివరణ ఇవ్వనున్నారు.