: నది పక్కనే నాలుగు కిలోమీటర్లు పరుగెత్తాం: ఓ విద్యార్థి వేదన
భవిష్యత్తుపై ఎన్నో ఆశలు, ఆశయాలతో ఉన్న 23 మంది విద్యార్థులను బియాస్ నది మింగేసింది! లార్జి డ్యామ్ అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యం వారి ఊపిరిని అర్ధాంతరంగా ఆపేసింది! హైదరాబాద్ లోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన మొత్తం 48 మంది విద్యార్థులు, ముగ్గురు ఫ్యాకల్టీ గత ఆదివారం సాయంత్రం నది వద్దకు వెళ్లగా... ఒక్కసారిగా వచ్చిన నీటి ప్రవాహంలో 23 మంది విద్యార్థులు, ఒక ఫ్యాకల్టీ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. నాటి ప్రమాదం నుంచి బయటపడిన విద్యార్థి రాఘవేంద్ర కొలము(19) తాము పడిన వేదనను తెలియజేస్తున్నాడు...
మనాలీకి వెళుతున్నాం. 48 మంది విద్యార్థులం, మా వెంట ముగ్గురు ఫాకల్టీ ఉన్నారు. బియాస్ నది వద్ద ఆగాలని నిర్ణయించుకున్నాం. నదిలో అడుగు మేర నీరు ఉంది. అక్కడ ప్రమాదానికి సంబంధించి ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేవు. నదిలోకి దిగరాదన్న సూచికలూ లేవు. దాంతో నది మధ్యలో ఉన్న రాళ్లపైకి ఎక్కి ఫొటోలు తీసుకుంటున్నాం. కొన్ని నిమిషాల తర్వాత నది నుంచి బయటకు వచ్చేశాను. వెంటనే నాకు పెద్దగా అరుపులు వినిపించాయి. వెనక్కి తిరిగి చూసే సరికి నీటి ప్రవాహం పెరిగిపోయింది. అప్పుడు సమయం సాయంత్రం 6.30గంటలు. చూస్తుండగానే 40 సెకండ్ల వ్యవధిలో మా స్నేహితులు కొట్టుకుపోయారు. రక్షించండి, రక్షించండి అని వారు అరుస్తున్నా మేము ఏమీ చేయలేకపోయాం. నది పక్కనే ఉన్న రోడ్డుపై మూడు నాలుగు కిలోమీటర్ల దూరం పరుగెత్తాం. కానీ, మా స్నేహితుల జాడ కనిపించలేదు. వారు కొట్టుకుపోయారు. అక్కడ లోతు కంటే నీటి వేగమే సమస్య. అక్కడ లైఫ్ జాకెట్లు, పడవలు అందుబాటులో లేవు. ఉంటే మా ఫ్రెండ్స్ ను కాపాడుకునేవాళ్లం. స్థానికులు తాళ్లు, కర్రలు తెచ్చిచ్చినా వాటితో ఏమీ చేయలేకపోయాం.
మా కళ్ల ముందే మా వాళ్లు కొట్టుకుపోతుంటే ఎంతో బాధ వేసింది. మా క్లాస్ సగం ఖాళీ అయిపోయింది. ఐశ్వర్య ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలనుకుంది. విష్ణు బ్యాడ్మింటన్ ప్లేయర్ కావాలనుకున్నాడు. మరొకరు సింగర్ అవ్వాలనుకున్నారు. అందరి కలలు నీటిపాలయ్యాయి. కాపాడాలంటూ నా ఫ్రెండ్స్ చేసిన రోదనలు నా హృదయం నుంచి చెరిగిపోవంటూ రాఘవేంద్ర నాటి పరిస్థితిని కళ్లకు కట్టాడు.