: నీటిలో కొట్టుకుపోయిన విజ్ఞాన్ జ్యోతి విద్యార్థులు... విహారయాత్రలో విషాదం!
హైదరాబాదులోని వి.ఎన్.ఆర్. విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 25 మంది విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో జరిగిన ప్రమాదంలో గల్లంతయ్యారు. కాలేజీకి చెందిన 50 మంది ఇన్ స్ట్రుమెంటేషన్ విభాగం, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఈ నెల 3న విహారయాత్రకు వెళ్ళారు. ఈ రోజు సాయంకాలం వీరు బియాస్ నది వద్ద ఫోటోలు తీసుకుంటుండగా ఒక్కసారిగా నీరు ముంచుకొచ్చి వారిని కమ్మేసింది. లాల్జీ గేట్లు చెప్పాపెట్టకుండా ఎత్తివేయడంతో నీరు వరదలా వచ్చేసింది.
దీంతో 25 మంది విద్యార్థులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వీరిలో ఆరుగురు అమ్మాయిలు కూడా వున్నారు. సంఘటన జరిగిన తర్వాత చీకటి పడిపోవడంతో సహాయక కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేబట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. మరోపక్క తమ పిల్లలు ఏమయ్యారో అన్న భయంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాదు, బాచుపల్లిలోని కాలేజీ వద్ద వీరు సమాచారం కోసం ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.