: పోలవరం గురించి కొట్లాడతామని ప్రధానికి చెప్పా: కేసీఆర్


పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆపి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ప్రధానికి సూచించానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టుపై యథాస్థితి కొనసాగితే, తమ నిరసనలు కొనసాగుతాయని ప్రధానికి స్పష్టం చేశానని అన్నారు. ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగిసిందని ఆయన తెలిపారు. 25 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని కేవలం ఐదేళ్లలోనే చేద్దామని ఆయన తెలిపారని కేసీఆర్ చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులోని అంశాలన్నీ అమలు చేయాలని ప్రధానికి సూచించానని ఆయన అన్నారు. అలాగే ప్రణాళికా సంఘాన్ని కలసి గిరిజనులు అత్యధికంగా ఉన్న తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కోరామని ఆయన తెలిపారు. గతంలో వెనుకబడిన జిల్లాలుగా గుర్తించిన జిల్లాలకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేందుకు నిధులు ఇవ్వాలని కోరామన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ ఏ సౌకర్యాలు కల్పించాలని కేంద్రం నిర్ణయించిందో అవే సౌకర్యాలు తెలంగాణ రాష్ట్రానికి కూడా కల్పించాలని కోరామని... దీనిపై ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారని కేసీఆర్ చెప్పారు. ఏదైనా అవసరమైతే ఫోన్లో మాట్లాడితే చాలు, చేసి పెడతానని ప్రధాని హామీ ఇచ్చారని ఆయన అన్నారు. తాను ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించి కేవలం నాలుగు రోజులే అయిందని, దానికే ఏవో కొంపలు మునిగిపోయినట్టు దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నారని, అది మంచి పద్దతి కాదని కేసీఆర్ హితవు పలికారు. ఇతర పార్టీల నేతల మాటలు నమ్మవద్దని కేసీఆర్ ప్రజలకు సూచించారు.

  • Loading...

More Telugu News