: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కాను: జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదని వైఎస్సార్సీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. రూ. 30 కోట్ల ప్రజాధనాన్ని ప్రమాణ స్వీకారం కోసం దుర్వినియోగం చేస్తున్నారని... దానికి నిరసనగానే తాను హాజరు కావడం లేదని చెప్పారు. రైతు రుణమాఫీ ఫైలుపై చంద్రబాబు తొలి సంతకం చేసినా, అవి మాఫీ అవుతాయన్న నమ్మకం లేదని... బాబు తొలి సంతకం ఓ భ్రమ అని ఎద్దేవా చేశారు.
ఓ వైపు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ప్రజల నుంచి వేల రూపాయలను కూడా చందాలుగా స్వీకరిస్తామని చెబుతూ... మరోవైపు ప్రమాణం స్వీకారం కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేయడం ఎంతవరకు సబబని జగన్ ప్రశ్నించారు. తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. రానున్న రోజుల్లో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని వెల్లడించారు.