: రాష్ట్రపతి పాలన డిమాండ్ అఖిలేష్ యాదవ్ పై పని చేసింది!
ఉత్తరప్రదేశ్ అత్యాచారాల రాజధానిగా మారిపోయిందని, పరిపాలన పడకేసిందని, తక్షణం రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రంలో బీజేపీ నేతలు గొంతు పెంచడంతో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం పని చేయడం ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్ కారణంగా అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ఠ మసకబారిపోతోందని, అత్యాచారాలను సమర్థిస్తూ సాక్షాత్తూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడమేంటని ఢిల్లీ నేతలు మండిపడడంతో, అత్యాచారాలను అరికడతామని యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రకటించారు.
కేరళలో హైకోర్టు ఎదుట మహిళలు అర్ధనగ్న ప్రదర్శనలు చేయడంతో, అతని భార్య ఎంపీ డింపుల్ మాట్లాడుతూ, అత్యాచార నిందితులను వదిలే ప్రసక్తి లేదని, చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తారని ప్రకటించారు. ఈ క్రమంలో పది మంది ఐపీఎస్ అధికారులను అఖిలేష్ ప్రభుత్వం బదిలీ చేసింది.
అత్యాచారాలకు నెలవుగా మారిన మొరాదాబాద్, బిజ్నోర్, హాపూర్, సహారన్ పూర్, ఔరియా జిల్లాలకు చెందిన ఎస్పీలు, సీనియర్ ఎస్పీలతో సహా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్యకార్యదర్శి లాంటి అత్యున్నత అధికారులను సైతం పదవీ బాధ్యతల నుంచి తప్పించి, ఎలాంటి పదవీ బాధ్యతలు అప్పగించకుండా లక్నోలోని డీజీపీ కార్యాలయానికి ఎటాచ్ చేశారు. కొత్తగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఐజీ పోస్టు సృష్టించి, అధికారిని నియమించారు.