: ఎన్టీఆర్ ఫొటోలతో మాకు సంబంధంలేదు : వైఎస్ఆర్ సీపీ
తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఫొటోలతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు రాబట్టుకోవాలని చూస్తోందని టీడీపీ నేతలు గళమెత్తుతోన్న సంగతి తెలిసిందే. ఈ అంశం మీద ఇవాళ హైదరాబాద్ లో వైఎస్ఆర్ సీపీ స్పందించింది. ప్లెక్సీలపై ఎన్టీఆర్ ఫొటోతో పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొణతాల రామకృష్ణ తేల్చిచెప్పారు. కేంద్రమంత్రిగా కొనసాగుతోన్న పురంధేశ్వరి ఎన్టీఆర్ ఫొటోతో ప్రచారం చేసిన సంగతి బాలకృష్ణ గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా కొణతాల సూచించారు.
కాగా, రాష్ట్రంలో విద్యుత్ సమస్యలపై కిరణ్ సర్కారు అహంభావంతో వ్యవహరిస్తోందని కొణతాల ఆరోపించారు. ప్రభుత్వానికి ఏమాత్రం ముందుచూపు లేకనే రాష్ట్రంలో విద్యుత్ సమస్య జటిలంగా మారిందని వ్యాఖ్యానించారు. విద్యుత్ సమస్య కారణంగా చాలా పరిశ్రమలు మూతపడే పరిస్థితి దాపురించిందని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం కుర్చీ కాపాడుకునేందుకే సమయమంతా సరిపోతోందని ఎద్దేవా చేశారు.