: బీపీయే కదా అని వదిలేస్తే ప్రాణం తీస్తుంది
బ్లడ్ ప్రెజర్, హైపర్ టెన్షన్, రక్తపోటు పేర్లు ఏవైనా మూడూ ఒకటే. మానవులను ముప్పు తిప్పలు పెట్టి మంచాన పడేయగల మహమ్మారి ఇది. ఏటా 94లక్షల మంది భారతీయులు రక్తపోటు కారణంగా కనుమూస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ముగ్గురిలోనూ ఒకరిపై అధిక రక్తపోటు ప్రభావం చూపిస్తోంది. 2030 నాటికి భారతీయులలో 21 కోట్ల మంది అధిక రక్తపోటు బారినపడతారని అంచనా.
ఈ రోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఈ నేపథ్యంలో మానవులను ఆనారోగ్యులుగా మారుస్తున్న రక్తపోటు గురించి కొంత తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుంటే నిశ్చింతగా ఉండవచ్చు. శరీరంలో ప్రతీ అవయవానికి రక్తం అనుక్షణం సరఫరా అవుతూ ఉంటుంది. గుండె నుంచి అన్ని ప్రాంతాలకూ ఇది సరఫరా కావాలంటే నిర్ణీత పీడనం అవసరం. అనారోగ్యకరమైన జీవన శైలి అంటే.. సరిపడా విశ్రాంతి లేకపోవడం, అధిక పని ఒత్తిడులు, వాయు, శబ్ద కాలుష్యం, అధిక ఉప్పు సేవనం, శారీరక వ్యాయామం లేకపోవడం, జన్యులోపాలు ఇలా అనేక రకాల కారణాల వల్ల ఈ పీడనంలో మార్పులు వస్తాయి. అప్పుడు పీడనం తగ్గొచ్చు, పెరగొచ్చు. పీడనం పెరగడాన్నే అధిక రక్తపోటు అంటారు. ఇలా పీడనం పెరిగితే గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, కళ్లు ముఖ్యమైన అవయవాలన్నింటిపై ప్రభావం పడుతుంది. ఫలితంగా శరీరం రోగాలమయం అవుతుంది.
నేడు కొందరు యువకులలోనూ బీపీ ఎక్కువగా ఉంటోంది. అందుకే నెలకోసారి బీపీ చెకప్ చేయించుకోవాలి. ఒకసారి ఎక్కువగా ఉందని తేలితే వైద్యుల సూచన మేరకు మందులు తీసుకోవాలి. నాలుగు రోజులు వాడి మానేస్తే అసలుకే ఎసరు వస్తుంది. అధిక బీపీ కారణంగా గుండెపోటు, పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీల విఫలం ఇలా అనేకానేక సమస్యలు రావచ్చు.
అందుకే మంచి పోషకహారం, మితంగా తీసుకుంటూ, వేళకు నిద్రిస్తూ, తగినంత విశ్రాంతి తీసుకోవాలి. శారీరక, నిత్య వ్యాయామం తప్పకుండా ఆచరించాలి. ఆత్మీయులతో అభిప్రాయాలు, భావాలు, కష్టాలు, బాధలు పంచుకుంటూ ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యం మీ దాసోహం అవుతుంది.