: రాష్ట్ర విభజనపై మూడేళ్ల కిందటే నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేది: వెంకయ్యనాయుడు
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంపై ప్రధాని నరేంద్ర మోడీకి నిన్న సోనియాగాంధీ లేఖ రాశారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సోనియా ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఇవాళ వెంకయ్య నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్ర విభజనపై మూడేళ్ల కిందటే నిర్ణయం తీసుకుని ఉంటే బాగుండేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా, రాజధాని నిర్మాణం వంటి సమస్యలున్నాయని ఆయన అన్నారు. బిల్లు రూపొందించేటప్పుడు సరిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. యూపీఏ నిర్లక్ష్య వైఖరే సమస్యలకు కారణమని వెంకయ్యనాయుడు అన్నారు. విశ్వసనీయత లేకపోవడం వల్లనే రెండు ప్రాంతాల్లోను కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని అన్నారు. రెండు రాష్ట్రాలపై ఎలాంటి వివక్ష లేకుండా కేంద్రం సాయం అందిస్తుందన్నారు. ఇరు ప్రాంతాలు త్వరితగతిన అభివృద్ధి చెందేందుకు కేంద్రం సాయం అందిస్తుందని ఆయన చెప్పారు.