: భారత్ లో అత్యాచారం... ఐక్యరాజ్యసమితిని కదిలించింది


ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ లో అక్కాచెల్లెళ్లపై దారుణ అత్యాచారం, హత్య ఘటన ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీమూన్ ను కూడా కదిలించింది. లైంగిక హింసకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అబ్బాయిలు అబ్బాయిల్లానే ఉండాలనే వినాశకర తత్వాన్ని అనుమతించవద్దని ఆయన ప్రపంచ సమాజానికి విజ్ఞప్తి చేశారు. 'గత రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా మహిళలు, బాలికలపై పలు దాడులు జరిగాయి. ముఖ్యంగా భారత్ లోని బదౌన్ లో ఇద్దరు టీనేజీ అమ్మాయిలపై దారుణ అత్యాచారం, హత్యతో నేను ఆందోళన చెందా. ఇంట్లో మరుగుదొడ్లు లేకపోవడంతో వారు బయటకు వెళ్లారు' అని బాన్ కీ మూన్ చెప్పారు.

మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింస శాంతి భద్రతల అంశం, మానవ హక్కులకు సంబంధించినదిగా ఆయన పేర్కొన్నారు. మహిళలపై హింసతో మన స్థాయి దిగజారినట్లేనన్నారు. మహిళలను సమానంగా చూసేలా చర్యలు తీసుకోవాలని అన్ని దేశాలను కోరారు. వారం క్రితం బదౌన్ లో అక్కాచెల్లెళ్లు అయిన ఇద్దరు దళిత బాలికలపై కొందరు దుండగులు అత్యాచారం చేసి చెట్టుకు ఉరితీసిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు దారితీయగా... ప్రపంచ మీడియా కూడా దీన్ని ఎత్తి చూపింది.

  • Loading...

More Telugu News