: అఫ్రిదికి సైకాలజిస్టు సేవలు
ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదికి సైకాలజిస్టులతో కౌన్సిలింగ్ ఇప్పించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయించింది . మరికొద్ది రోజుల్లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో అఫ్రిదిని సన్నద్ధం చేసేందుకు మానసిక నిపుణుడి సేవలు అవసరమని పీసీబీ భావిస్తోంది. ఇటీవలి కాలంలో బౌలర్ గానే రాణిస్తున్న అఫ్రిది తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో మొత్తం ఐదు మ్యాచ్ ల్లో ఒక్క వికెట్టూ తీయలేకపోవడం పీసీబీని తీవ్రంగా కలవరపరిచింది. పైగా బ్యాటింగ్ లోనూ రెండంకెల స్కోర్లు కేవలం రెండుసార్లు (34, 88) సాధించాడు.
ఈ నేపథ్యంలో చాంపియన్స్ ట్రోఫీ ముందర ఫామ్ నిరూపించుకునేందుకు పాక్ సెలెక్టర్లు అఫ్రిదికి ఓ అవకాశం ఇచ్చారు. దీంతో, దేశవాళీ టోర్నీ ప్రెసిడెంట్స్ కప్ పరిమిత ఓవర్ల టోర్నీలో అఫ్రిది తన సత్తా నిరూపించుకునేందుకు తహతహలాడుతున్నాడు. ప్రస్తుతం చాంపియన్ ట్రోఫీ కోసం పాక్ ప్రాబబుల్స్ కు ఎంపికైన అఫ్రిది.. తుది జాబితాలో చోటు సంపాదించాలంటే, ప్రెసిడెంట్స్ కప్ లో రాణించకతప్పదు. కాగా, చాంపియన్స్ ట్రోఫీ జూన్ 6 నుంచి ఇంగ్లండ్ లో జరగనుంది.