: 'చష్మే బద్దూర్'.. అసలు.. నకలు..!


చష్మే బద్దూర్.. 1981లో ఉత్తర భారతాన్ని ఉర్రూతలూగించిన రొమాంటిక్ కామెడీ చిత్రం. అప్పట్లో ఆ సినిమా చూసిన వాళ్ళు అందులో పాత్రలైన ఒమి, జాయ్ లను ఎన్నటికీ మరువలేరంటే అతిశయోక్తి కాదు. ఈ పాత్రలను రాకేష్ బేడి, రవి బస్వాని పోషించారు. తమ స్నేహితుడికి, అతను ప్రేమిస్తున్న అమ్మాయికి మధ్య గొడవలు పెడుతూ, వారిద్దరినీ విడదీసేందుకు సదా యత్నించే చిలిపి నేస్తాలుగా వీరిద్దరూ సినిమాకు జీవం పోశారు. ఇక హీరో హీరోయిన్లుగా ఫరూక్ షేక్, దీప్తి నావల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాయి పరంజపే దర్శకుడు.

ఇప్పుడదే సినిమా అదే పేరుతో ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే తారాగణం మారింది. అంటే అర్థమయ్యే ఉంటుంది రీమేక్ చిత్రమని. అదే కథాంశం తీసుకుని కామెడీ దర్శకుడు డేవిడ్ ధావన్ సాహసానికి ఒడిగట్టాడనే భావించాలి. ఎందుకంటే, ఒరిజినల్ కు ఎక్కడా తగ్గని రీతిలో రీమేక్ ఉంటేనే సినిమా మినిమమ్ గ్యారంటీ సొంతం చేసుకోగలదు. పైగా,దీని మాతృక పరభాషా చిత్రం కాదాయె! హిందీలో అందరి మన్ననలకు అర్హమైన ఈ చిత్రాన్ని అదే రీతిలో వండకపోతే అభాసుపాలయ్యే ప్రమాదమే ఎక్కువ. ఈ విషయం ధావన్ కు తెలియందికాదు. అందుకే, తారాగణం ఎంపికలో చాలా జాగ్రత్తలు వహించాడు. సిద్ధార్థ్, అలీ జాఫర్, దివ్యేందు శర్మ, తాప్సీలను ఎంచుకుని సినిమాను సగం సక్సెస్ చేశాడు.

ఈ సినిమాలో హీరోగా సిద్ధార్థ్ కు పూర్తి మార్కులు ఇవ్వొచ్చు. హాస్యాన్ని పండించడం సిద్ధార్థ్ కు కొత్తేమీ కాదు. దక్షిణాది చిత్రాల్లో ఈ యువ హీరో నటించిన చిత్రాలన్నింటిలోనూ కామెడీకి పెద్దపీట వేయడం చూస్తుంటాం. ఇక ఈ సినిమాలో అతనికి జోడీగా తాప్సీ.. హీరోహీరోయిన్ల మధ్య సమస్యలు సృష్టించే మిత్రులుగా అలీ జాఫర్, దివ్యేందు శర్మ తమ పరిధి మేరకు నటించారు.

మొత్తానికి ఈ చిత్రం కోసం థియేటర్ కు వెళ్ళిన వారిని 'శాటిస్ఫై' చేయడంలో చిత్ర బృందం సక్సెస్ అయినట్టే. ఆ విషయాన్ని ఓపెనింగ్సే చెబుతున్నాయి. ఇంతకీ 'చష్మే బద్దూర్' అంటే చెప్పనేలేదు కదూ.. మనం ఒక్కోసారి 'వ్యక్తులకు నరదృష్టి సోకింది.. దిష్టి తీయాలి' అని వింటుంటాం, అంటుంటాం. ఆ దిష్టి తీసే సమయంలో 'ఇరుగుదిష్టి పొరుగుదిష్టి' అని ఆ వ్యక్తి చుట్టూ ఉప్పో, మిరపకాయో తిప్పుతాం. అదే, పర్షియన్ సంస్కృతి ప్రకారం అయితే, దిష్టి తీస్తూ 'చష్మే బద్దూర్' అంటారు. అంటే 'దయ్యమా.. దూరంగా పో' అని అర్థమట!

  • Loading...

More Telugu News