: బీజేపీలో విభేదాలు?... వెంకయ్య సభకు కిషన్ రెడ్డి డుమ్మా
రాష్ట్ర బీజేపీలో విభేదాలు ఈ రోజు బట్టబయలయ్యాయి. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి హైదరాబాదుకు వచ్చిన వెంకయ్యనాయుడుకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. బేగంపేట విమానాశ్రయం నుంచి పార్టీ ఆఫీసు వరకు ర్యాలీగా తీసుకెళ్లాయి. రాష్ట్ర సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, బంగారు లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి తదితరులు వెంకయ్య వెంటే ఉన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో వెంకయ్య ప్రసంగించారు. అయితే, ఈ కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గైర్హాజరయ్యారు. వ్యక్తిగత పనుల మీద ఆయన బెంగళూరు వెళ్లినట్టు సమాచారం. అయితే, రాష్ట్ర విభజన సమయంలోనే వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డిల మధ్య విభేదాలు మొలకెత్తాయనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ విభేదాలే ఈనాటి కిషన్ రెడ్డి గైర్హాజరీకి కారణమని తెలుస్తోంది.