: విశాఖ అమ్మాయి ప్రేమించడం లేదని వరంగల్ అబ్బాయి నిప్పంటించుకున్నాడు
విశాఖ యువతి ప్రేమించడం లేదని వరంగల్ యువకుడు నిప్పంటించుకున్నాడు. విశాఖపట్టణంలోని కంచరపాలెంలోని పాలిటెక్నిక్ కళాశాలలో భరత్ ద్వితీయ సంవత్సరం డిప్లొమా చదువుతున్నాడు. అదే కళాశాలలో చదువుతున్న కంచరపాలెం సింహగిరి కాలనీకి చెందిన యువతిని భరత్ రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. భరత్ అంటే ఇష్టం లేని ఆ యువతి అతడిపై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కళాశాల ప్రిన్సిపల్ భరత్ ను మందలించారు. అయినా భరత్ ఆ అమ్మాయిని వేధించడం మానలేదు. ఎందుకు తల నొప్పి అని భావించిన అమ్మాయి తల్లిదండ్రులు నాలుగు నెలలుగా కూతుర్ని కాలేజీకి పంపడం మానేశారు. దీంతో ఆ కుర్రాడు అమ్మాయి ఇంటి అడ్రస్ తెలుసుకుని పెట్రోలు బాటిల్ తో వెళ్లాడు. బాలికను ప్రేమిస్తున్నానంటూ హల్ చల్ చేశాడు. తనను ప్రేమించకుంటే ఒళ్ళు కాల్చుకుని చస్తానంటూ బెదిరింపులకు దిగాడు.
బాలిక ఇంట్లో లేదని చెబుతున్నా వినకుండా, ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో యువతి తల్లి అతనిపై బిందెతో నీరు కుమ్మరించి మంటలు ఆర్పింది. స్థానికులు 108కు సమాచారం అందించడంతో ప్రథమచికిత్స చేసి వైద్యం కోసం కేజీహెచ్ కు తరలించారు. అతడి శరీరం 30 శాతం కాలిందని వైద్యులు గుర్తించారు.