: అనూహ్యపై అత్యాచారం జరిగింది: ముంబై పోలీసులు
ముంబైలో ఘోర హత్యకు గురైన మచిలీపట్నం యువతి, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనూహ్య ఎస్తేర్ కేసులో పోలీసులు కోర్టులో చార్జ్ షీటు దాఖలు చేశారు. 76 మంది సాక్షులను విచారించి 542 పేజీల చార్జ్ షీటు దాఖలు చేసినట్లు ముంబై పోలీస్ కమిషనర్ సదానంద్ ధాతే మీడియాకు తెలిపారు. అనూహ్యను చంద్రభానే హత్య చేశాడనడానికి తగిన ఆధారాలను సేకరించామని చెప్పారు. ఈ ఏడాది జనవరిలో అనూహ్య హత్యకు గురైన విషయం తెలిసిందే.
నిందితుడు చంద్రభాను దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న అనూహ్య కళ్లద్దాలు, ఐడీ కార్డు, ఇతర వస్తువులపై ఉన్న డీఎన్ఏ ఆమె డీఎన్ఏతో సరిపోలినట్లు కమిషనర్ సదానంద్ వెల్లడించారు. అలాగే, అనూహ్యపై అత్యాచారం జరిగినట్లు తమ విచారణలో వెల్లడైందని చెప్పారు. అనూహ్య మృతదేహం కుళ్లిపోయి లభ్యం కావడంతో వైద్యపరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ కాని విషయం తెలిసిందే.