: వామ్మో... పైలట్లు కూడా తాగి నడుపుతున్నారు


తాగితే టూ వీలర్ కూడా నడపరాదన్నది నిబంధన. కానీ, ఆకాశంలో ఎన్నో ప్రతికూలతలతో కూడిన పరిస్థితుల్లో విమానాలను నడిపే మన పైలట్లు కూడా సురాపానం చేస్తున్నారు. ప్రయాణికుల భద్రతను గాల్లో దీపంలా మార్చేస్తున్నారు! 2009 నుంచి 2014 ఫిబ్రవరి మధ్య 165 మంది పైలట్లు ఇలా తాగి దొరికిపోయారు. పరీక్షించిన సమయంలో వీరి రక్తంలో ఆల్కహాల్ శాతం పరిమితికి మించి ఉన్నట్లు తేలింది. సమాచార హక్కు కింద ఒకరు దరఖాస్తు చేయగా పౌరవిమానయాన డైరక్టరేట్ విభాగం (డీజీసీఏ) ఈ వివరాలను వెల్లడించింది.

ఢిల్లీలో 50 మంది పైలట్లు, ముంబైలో 47, కోల్ కతాలో 18, చెన్నైలో 17 మంది పైలట్లను తాగినందువల్ల ప్రయాణానికి అనుమతించకుండా అడ్డుకున్నారు. రక్తంలో పరిమితికి మించి ఆల్కహాల్ శాతంతో పట్టుబడుతున్న పైలట్ల సంఖ్య ఏటేటా పెరుగుతున్నట్లు డీజీసీఏ గణంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఇలా పట్టుబడ్డ పైలట్లపై ఏమైనా చర్య తీసుకున్నారా? వారు ఏ విమానయాన సంస్థలకు చెందినవారు? అన్న వివరాలను మాత్రం డీజీసీఏ గోప్యంగా ఉంచడం గమనార్హం.

డీజీసీఏలో తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్ల పైలట్లు అందరినీ తనిఖీ చేయడం లేదు. దానికి బదులు కొందరినే బ్రీత్ అనలైజర్ తో పరీక్షిస్తున్నారు. నిబంధనల ప్రకారం పైలట్ సహా కేబిన్ సిబ్బంది అంతా ప్రయాణ సమయానికి 12 గంటల్లోపు ఆల్కహాలు తీసుకోకూడదు. పైలట్ మొదటి సారి పట్టుబడితే ఫ్లయింగ్ లైసెన్స్ ను మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తారు. రెండోసారి దొరికితే రెండు సంవత్సరాలపాటు సస్పెండ్ చేస్తారు. అనుభజ్ఞులైన పైలట్ల కొరత ఉండడంతో విమానయాన సంస్థలు చూసీ చూడనట్లు ఉంటున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News