: మరి కొద్ది గంటల్లో ఏపీ, తెలంగాణల్లో అంధకారం
విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లనున్నాయి. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి కనీస స్థాయికి పడిపోయింది. విజయవాడలోని ఎన్టీటీపీసీలో నాలుగు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 1760 మెగావాట్లకు గాను కేవలం 100 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఇక్కడ బొగ్గు నిల్వలు అయిపోయాయి. మరి కొద్ది గంటల్లో ఉత్పత్తి పూర్తిగా ఆగిపోనుంది. అలాగే, ఆర్టీపీపీలోని 5 యూనిట్లలో 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ఖమ్మం జిల్లా పాల్వంచలో ఉన్న కేటీపీఎస్ లో 1500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
విద్యుత్ లోటుతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను వీలైనంతగా తగ్గించి వేశారు. ఆసుపత్రుల్లో విద్యుత్ లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఇదే కొనసాగితే మరి కొద్ది గంటల్లో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లనుంది. ముందస్తు జాగ్రత్త చర్యగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, సబ్ స్టేషన్ల వద్ద పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.