: 'బాద్ షా' డిసైడయ్యాడు.. మరి సినిమా ఎటు సైడు..!?
గత సినిమా 'దమ్ము' నిరాశ పరిచిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ చేసిన మరో బృహత్ ప్రయత్నమే 'బాద్ షా'. సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల, భారీ చిత్రాల నిర్మాత బండ్లగణేశ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం అభిమానులకు షడ్రసోపేతమైన విందు భోజనమే . కొన్ని వరుస పరాజయాల నేపథ్యంలో హిట్ కొట్టాలన్న తపన.. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ తీసుకున్న శ్రద్ధ ద్వారా స్పష్టమవుతోంది. మేకోవర్ దగ్గర్నుంచి డైలాగ్ డెలివరీ వరకు డిఫరెంట్ గా సాగింది. కొత్త లుక్కుతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నట్టే ఉంది. హీరోయిన్ గా కాజల్ ఎప్పట్లానే క్యూట్ గా కనిపించింది. ఈ అందాల తార డ్యాన్సుల్లో ఎన్టీఆర్ సరసన హుషారుగా నర్తించడంతో పాటలు ఆన్ స్క్రీన్ పైనా హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.
మహేశ్ బాబు వాయిస్ ఓవర్.. హీరో సోదరుడిగా సిద్దార్థ నటించడం.. చాక్లెట్ బాయ్ నవదీప్ నెగెటివ్ రోల్ పోషించడం సినిమాకు కొత్త లుక్కును ఆపాదించిపెట్టాయని చెప్పుకోవాలి. సినిమా కథ విషయానికొస్తే.. విలన్ కెల్లీ దోర్జీ విదేశాల్లో ఇండియాలో బాంబు దాడులకు కుట్ర చేయడం.. హీరో ఎన్టీఆర్ దాన్ని భగ్నం చేసేందుకు నడుంబిగించడం ఆ ప్రయత్నంలో జరిగే సంఘటనల సమాహారమే ఈ సినిమా. ఎన్టీఆర్ కుటుంబాన్ని అంతమొందించేందుకు విలన్ చేసే ప్రయత్నాలు, హీరో వాటిని వమ్ము చేయడం వంటి రొటీన్ కథే అయినా శ్రీను వైట్ల మార్కు ప్రతి సీన్ లోనూ కనిపిస్తుంది.
ఇక ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ వెరీ సీరియస్ గా కనిపిస్తాడు. డాన్ గా, లవర్ బాయ్ గా మార్కులు కొట్టేశాడు. ఇక ద్వితీయార్థంలో ఎన్టీఆర్ పాత్ర కామెడీ ట్రాక్ లో సాగుతుంది. హీరోయిన్ కాజల్, కామెడీ కింగ్ లు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణలతో ఎన్టీఆర్ చేసిన సీన్లు ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. కాగా, 'బాషా' సినిమాతో 'బాద్ షా'కు పోలికలు కనిపిస్తున్నా.. శ్రీను వైట్ల తన మార్కు కామెడీతో ఆ ప్రభావం నుంచి సినిమాను దూరంగా తీసుకెళ్ళాడు. అయితే ఫ్లాష్ బ్యాక్ లో మాత్రం 'బాషా' సినిమా గుర్తుకు రాకమానదు. కొన్ని సీన్లు శ్రీను వైట్ల గత చిత్రాలను జ్ఞప్తికి తెస్తూ ప్రేక్షకులను నిరాశపరిచాయి.
మరోసారి బ్రహ్మానందం-శ్రీను వైట్ల కాంబినేషన్ విజయవంతమైంది. పిల్లి పద్మనాభ సింహం పాత్రలో బ్రహ్మీ తన ఓన్ స్టయిల్ లో కామెడీని పండించాడు. కథలో అంతర్లీనంగా సాగడమే బ్రహ్మానందం పాత్ర సక్సెస్ కి కారణం. అదే సమయంలో సెపరేట్ ట్రాక్ లో వచ్చిన ఎంఎస్ నారాయణ పెద్దగా నవ్వించలేకపోయాడు. కథాపరంగా నవ్యత లోపించినా, పకడ్బందీ స్క్రీన్ ప్లేతో ఆ లోటు కనిపించనీయలేదనే చెప్పుకోవాలి. తమన్ అందించిన సంగీతం సినిమా ఎలివేట్ అయ్యేందుకు ఎంతో తోడ్పడింది. నేపధ్య సంగీతం కొన్ని సీన్లను బాగా పండించింది. పాటలు విడుదలకు ముందే హిట్ అవ్వడం ప్లస్ పాయింట్. కోన వెంకట్, గోపీ మోహన్, శ్రీను వైట్ల 'పెన్ పవర్' ప్రతి డైలాగులోనూ స్పష్టం అవుతోంది. ఓవరాల్ గా ఈ సమ్మర్ లో 'బాద్ షా' తినడానికి తియ్యనైన 'బాదు షా'లా ఉంటుందనే భావించాలి.