: నా ప్రాంత అభివృద్ధి కోసమే టీడీపీలో చేరా: ఎస్పీవై రెడ్డి
తాను టీడీపీలో చేరానని కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయని... రానున్న ఐదేళ్ల వరకు ఏ ఎన్నికలు ఉండవని... జీవితంలో ఐదేళ్ల కాలం అత్యంత విలువైనదని తెలిపారు. 'అందువల్ల మా ప్రజలు, మా ప్రాంత అభివృద్ధి కోసం టీడీపీలో చేరా'నని చెప్పారు. టీడీపీలో చేరాలన్న తన అభిప్రాయాన్ని ముందుగా టీజీ వెంకటేష్ కు చెప్పానని... ఆయన వెంటనే తన గురించి టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడారని చెప్పారు. చంద్రబాబు తన విజ్ఞప్తిని గౌరవించి తనకు టీడీపీలో చేరే అవకాశాన్ని కల్పించారని తెలిపారు.
తనకు రాజకీయాలు వృత్తి కాదని, కేవలం ప్రవృత్తి మాత్రమే అని ఎస్పీవై రెడ్డి చెప్పారు. రాజకీయాల కోసం తాను పార్టీ మారలేదని... కేవలం డెవలప్ మెంట్ కోసమే టీడీపీలో చేరానని చెప్పారు. వైఎస్ఆర్సీపీలో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని... జగన్ తో తనకు విభేదాలు లేవని చెప్పారు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా టీడీపీలో చేరే అవకాశం ఉందని... ఈ దిశగా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.