: తంబే రికార్డు బద్దలు కొట్టనున్న లారా, భోథమ్
ప్రపంచ క్రికెట్ లో అత్యంత సీనియర్ ఆటగాడు ప్రవీణ్ తంబే రికార్డ్ ను మాజీ క్రికెట్ దిగ్గజాలు బ్రయాన్ లారా, ఇయాన్ బోథమ్ బ్రేక్ చేయనున్నారు. ఎందులోనా అని ఆలోచిస్తున్నారా? వయసులో! 40 ఏళ్లకు పైబడినా ఇంకా క్రికెట్ ఆడుతున్న ఏకైక క్రికెటర్ ప్రవీణ్ తంబే మాత్రమే. రిటైర్ అయిపోయిన వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్ మన్ బ్రయాన్ లారా, ఇంగ్లాండ్ ఆల్ రౌండ్ దిగ్గజం ఇయాన్ బోథమ్ మరోసారి బ్యాటు పట్టనున్నారు. కరేబియన్ దీవుల్లో జరిగే సీపీఎల్ (కరేబీయన్ ప్రీమియర్ లీగ్)లో అలనాటి దిగ్గజాలు మరోసారి బ్యాటుపట్టి సత్తా చూపనున్నారు.
ఆగస్టు 12న వార్నర్ పార్క్ లో జరిగే ఛారిటీ మ్యాచ్ లో బ్రయాన్ లారా విండీస్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనుండగా, ఇంగ్లాండ్ జట్టుకు ఇయాన్ బోథమ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్ లో మరిన్ని ఆకర్షణలు చోటుచేసుకుంటాయని నిర్వాహకులు ప్రకటించారు. కాగా బ్రిటిష్ మీడియా కింగ్ పియర్స్ మోర్గాన్ ఇప్పటికే బోథమ్ జట్టులో ఆడుతానని ప్రకటించడం విశేషం.