: 'కాంగ్రెస్.. పక్కా కమర్షియల్ పార్టీ' అంటోన్న బాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ను ఫక్తు వ్యాపార పార్టీగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉదయం పత్తిపాడు, రంపచోడవరం నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం అయ్యారు. బాబూ జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం బాబు మాట్లాడుతూ.. టీడీపీ, కాంగ్రెస్ మధ్య భేదాలను వివరించడంతో పాటు కార్యకర్తలకు పలు అంశాలపై దిశానిర్ధేశం చేశారు.
ఎన్నికల సమయంలోనే కాకుండా ఎల్లప్పుడూ అప్రమత్తంగా వ్యవహరించాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ వ్యూహాలపై నియోజకవర్గాలు, గ్రామాలు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఏ పార్టీకి లేనంత భారీ సంఖ్యలో టీడీపీకి కార్యకర్తలున్నారని ఈ సందర్భంగా బాబు చెప్పుకొచ్చారు.