: అన్నం పెట్టలేదన్న కోపంతో తల్లిని కొట్టి చంపిన కొడుకు
సమయానికి భోజనం పెట్టలేదన్న కోపంతో ఓ వ్యక్తి కన్న తల్లిని రాయితో కొట్టి చంపేశాడు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని కుర్దా జిల్లాలో చోటు చేసుకుంది. భువనేశ్వర్ కు 30 కి.మీ. దూరంలో ఉన్న రాయట్ పట్నా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగిందని బాలిపట్న ఎస్సై సురేంద్ర కుమార్ చెప్పారు.
పోలీసుల కథనం ప్రకారం... సురేంద్ర బెహారా అలియాస్ సౌరియా (35) తన తల్లి లలిత(60)ను భోజనం పెట్టాల్సిందిగా అడిగాడు. అయితే, ఆమె కొద్దిగా ఆలస్యం చేయడంతో అతను పట్టరాని కోపంతో ఓ పెద్ద రాయిని తీసుకుని ఆమె తలపై గట్టిగా కొట్టాడు. దీంతో లలిత అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని అరెస్ట్ చేశామని ఎస్సై చెప్పారు.