: 'మనం' సినిమా రివ్యూ
అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాలు తెరపై కనిపించనుండటంతో 'మనం' సినిమాపై ముందు నుంచే ఆసక్తి నెలకొంది. విడుదలకు ముందే ప్రోమోలతో ఈ చిత్రం ప్రేక్షకులకు చేరువైంది. దీనికి తోడు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం కావడం కూడా సినిమాపై అంచనాలను పెంచింది. వీటన్నింటికీ తగ్గట్టుగానే ఈ రోజు విడుదలైన 'మనం' విమర్శకుల్ని సైతం ఆకట్టుకుంది. మంచి టాక్ సంపాదించుకున్న 'మనం' విశేషాల్లేంటో చూద్దాం.
రాధామోహన్ - కృష్ణవేణి, సీతారాం - రామ లక్ష్మి జంటలు అర్ధాంతరంగా చనిపోయి మళ్లీ పుడతాయి. వీరిని కలపడానికి వారి కుమారులు చేసిన ప్రయత్నమే ఈ చిత్ర కథ. ఈ సినిమాలో రాధామోహన్, నాగార్జునగా నాగ చైతన్య... సీతారాం, నాగేశ్వరరావు పాత్రల్లో నాగార్జున నటించారు. రామలక్ష్మి, అంజలి పాత్రల్లో శ్రియ... కృష్ణవేణి, ప్రియగా సమంత నటించగా, నాగచైతన్య పాత్రలో అక్కినేని నాగేశ్వరరావు నటించారు.
కథ విషయానికొస్తే... చిన్న వయసులోనే ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించిన బిజినెస్ మాగ్నెట్ నాగార్జున. ఓ రోజు అనుకోకుండా సమంత, నాగచైతన్యలను కలుసుకుంటాడు. వీరిని చూడగానే చనిపోయిన తన తల్లిదండ్రులు మళ్లీ పుట్టారని నిర్ధారించుకుంటాడు. కథాగమనంలో ఓ రోజు యాక్సిడెంట్ కు గురైన అక్కినేని నాగేశ్వరరావుకు రక్తాన్ని ఇచ్చి కాపాడుతాడు. ఈ క్రమంలో శ్రియ తారసపడుతుంది. నాగార్జున, శ్రియను చూసిన నాగేశ్వరరావు... చనిపోయిన తన తల్లిదండ్రులు వీరే అని గుర్తిస్తాడు. వీరిద్దరినీ ఎలాగైనా కలపాలని ప్రయత్నిస్తాడు. ఈ రకంగా నాగచైతన్య, సమంతలను కలపడానికి నాగార్జున... శ్రియ, నాగార్జునలను కలపడానికి నాగేశ్వరరావు చేసిన ప్రయత్నమే 'మనం' సినిమా. వీరు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయా? మళ్లీ పుట్టిన వాళ్లు తమ పూర్వ జన్మ గురించి తెలుసుకుంటారా? అనేదే ఈ చిత్రం ఇతివృత్తం.
ఈ చిత్రంలో నటించిన వారంతా తమ పాత్రలకు జీవం పోశారు. చివరి సన్నివేశం వరకు నాగేశ్వరరావు పాత్ర చక్కటి అనుభూతిని కలిగిస్తుంది. నాగచైతన్య వయసుకు మించిన పాత్రను పోషించినప్పటికీ ఫుల్ మార్కులను కొట్టేశాడు. నాగార్జున, సమంత, శ్రియలు రెండు పాత్రల్లోనూ ఒదిగిపోయారు. దీనికి తోడు బ్రహ్మానందం, అలీల కామెడీ కూడా బాగా పండింది.
ఈ సినిమా విజయానికి సంబంధించిన పూర్తి క్రెడిట్ దర్శకుడు విక్రమ్ కే చెందుతుంది. ఇన్ని పాత్రల మధ్య ఎక్కడా సమన్వయం లోపించకుండా అద్భుత రీతిలో తెరకెక్కించాడు. రెండు పునర్జన్మల కథను ప్రేక్షకులకు చేరువచేయడంలో సఫలీకృతం అయ్యాడు. అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది. అతను అందించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా విజయాన్ని ఒక టీం ఎఫర్ట్ గా చెప్పవచ్చు. వందేళ్ల సినీ చరిత్రలో 70 ఏళ్లపాటు తనదైన ముద్రవేసిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావుకు 'మనం' విజయం ఓ ఘన నివాళి.