: పిజ్జా డ్రోన్ లపై మండిపడిన ముంబై పోలీసులు
వినియోగదారుల ఇంటి వద్దకు పిజ్జాలు చేరవేసేందుకు డ్రోన్ లు ఉపయోగించడంపై ముంబై పోలీసులు మండిపడ్డారు. ఇలాంటి ప్రయోగాలు చేసే ముందు తమకు ఎందుకు తెలియచేయలేదని, అనుమతులు ఎందుకు తీసుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ నుంచి కూడా సదరు పిజ్జా హౌస్ వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదని తెలుస్తోంది. ఫ్రాన్సెస్కోస్ పిజ్జెరియా అనే ఔట్ లెట్ వాళ్లు ఇలా డ్రోన్ సాయంతో పిజ్జాలను డెలీవరీ చేయడానికి ప్రయత్నించారు.
అయితే ఏ వస్తువునైనా గాల్లోకి ఎగురవేసేముందు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఏటీసీ వర్గాలు తెలిపాయి. రిమోట్ కంట్రోల్ సాయంతో ఎగరేసే ఇలాంటి వస్తువుల వల్ల భద్రతాపరమైన ముప్పు పొంచి ఉంటుందని, అందుకే ముందస్తు అనుమతి తీసుకోవాలని వారు చెబుతున్నారు. అయితే, ఆ డ్రోన్ ప్రయోగానికి సంబంధించిన పూర్తి వివరాలను తాము తీసుకుంటామని అదనపు పోలీసు కమిషనర్ మధుకర్ పాండే తెలిపారు.