: మోడీ ఫస్ట్ టార్గెట్ దావూద్ ఇబ్రహీం?
కాబోయే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారం చేపట్టగానే ఏం చేస్తారు? అనే విషయం ఇప్పుడు అందర్లోనూ ఆసక్తిని రేపుతోంది. పేదల అభ్యున్నతి కోసం పథకాలు చేపట్టడం, దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం, ఉద్యోగాల కల్పనకు చర్యలు... ఇలా చాలానే ఉంటాయి. కానీ, ఊహించని విధంగా ఇంటర్నేషనల్ మాఫియా డాన్, ముంబై బాంబు పేలుళ్ల ఘటనలో కీలక నిందితుడు దావూద్ ఇబ్రహీం అంతు చూడటం కూడా మోడీ అజెండాలో ప్రధానంగా ఉంది. దీనికి సంబంధించి విశ్వసనీయ సమాచారం అందుతోంది. మోడీ అఖండ విజయం సాధించగానే... కరాచీలో ఉండే దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్, ఆఫ్ఘాన్ సరిహద్దులకు పారిపోయాడు. తాలిబన్ల ప్రాబల్యం ఉండే ఓ ప్రాంతంలో తలదాచుకున్నాడు. ఇప్పటిదాకా కరాచీలో అత్యున్నత స్థాయికి చెందిన ప్రముఖులు ఉండే ప్రాంతంలో నివాసం ఉంటూనే... తన వ్యాపార లావాదేవీలను దావూద్ చక్కబెట్టేవాడు. ప్రస్తుతం మోడీ భయంతో అతను పలాయనం చిత్తగించాడు.
మరో విషయం ఏమిటంటే... ముంబైలో మాఫియా అనేదే లేకుండా చేయడం కూడా మోడీ ప్రధాన లక్ష్యం. ఇప్పటికే ముంబై బాంబు పేలుళ్ల కేసును దర్యాప్తు చేసిన సీనియర్ పోలీసు అధికారులతో మోడీ ఈ విషయాలపై చర్చించినట్టు సమాచారం. ఇంటలిజెన్స్ సీనియర్ అధికారి ఒకరితో కూడా చర్చించారు. మోడీ రాక ఎంత ప్రమాదకరమో తెలిసిన ముంబైలోని దావూద్ అనుచరులు... ఇప్పటికే ముంబైని వదిలి ఇతర ప్రదేశాలకు చేరుకున్నారు.
ప్రపంచం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ ను అంతమొందించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇదే కోణంలో దావూద్ ను తుదముట్టిస్తే మోడీ ఇమేజ్ ఆకాశాన్నంటుతుంది. దేశ ప్రజలు జేజేలు పలుకుతారు. స్వతహాగా దేశ భక్తి మెండుగా ఉండే మోడీ... దావూద్ ఇబ్రహీంను అంతమొందించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని సమాచారం. ఇప్పటికే దావూద్ పై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ అయినా... ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేయలేదు. దావూద్ ఎక్కడున్నాడో అమెరికాకు క్లియర్ గా తెలిసినప్పటకీ అతన్ని అరెస్ట్ చేయకుండా మిన్నకుండి పోయింది. దీంతో, డైరెక్ట్ గా రంగంలోకి దిగేందుకు మోడీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.