: మోడీ పాలనలో దేశ సమైక్యత మరింత పరిపుష్టం అవుతుంది: అమిత్ షా
దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్రమోడీకి గుజరాత్ శాసనసభ్యులు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మోడీని కీర్తించారు. దేశ వ్యాప్తంగా ప్రజలు మోడీని ఆశీర్వదించారని ఆయన సన్నిహితుడు, బీజేపీ నేత అమిత్ షా అన్నారు. మోడీ పాలనలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు మరింత బలపడతాయని పేర్కొన్నారు. మోడీ పాలనలో దేశ సమైక్యత మరింత పరిపుష్టం అవుతుందని, రాష్ట్రాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయని తెలిపారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం మోడీలో ఉందన్నారు. విద్య, వైద్యం సహా ఆరు అంశాల్లో గుజరాత్ లో మోడీ ప్రభుత్వం సాధించిన ప్రగతి ఆచరణనీయమని ప్రశంసించారు. దళితులకు, బలహీన వర్గాలకు మోడీ పాలనలో సమన్యాయం, సముచిత గౌరవం దక్కాయని చెప్పారు.
అటు పలువురు శాసనసభ్యులు కూడా మోడీని కొనియాడారు. గుజరాత్ ముద్దుబిడ్డ దేశ ప్రధాని కావటం గర్వకారణంగా ఉందన్నారు. గాంధీ, పటేల్ తర్వాత దేశాన్ని శాసించే వ్యక్తి గుజరాత్ నుంచి ఉండటం అభినందనీయమని అభిప్రాయపడ్డారు.